Sunday, October 7, 2012


సీజనల్‌ ఫ్రూట్స్‌ తింటే గుండె పదిలం...!

ప్రస్తుత రోజుల్లో గుండె సంబంధిత వ్యాధులు అధికమైపోయాయి. చిన్న వయసులోనే గుండెజబ్బులు రావటం, గుండె పోటు కారణంగా మరణాలు సంభవించడం జరుగుతోంది. శరీరంలో గుండె ఒక ప్రధాన భాగం. ఇది ఒక పెద్దకండరం కాగా, ఇరవై నాల్గు గంటలూ పనిచేస్తూనే వుంటుంది. శరీరంలోని వివిధ భాగాలకు రక్తప్రసరణ చేస్తుంది. గుండెకు సంబంధించిన రక్తనాళాలలో ఎటువంటి అడ్డంకులు ఏర్పడకుండా మంచి ఆహారాలు, తగిన వ్యాయామం సహకరిస్తాయి.

సాధారణంగా నలభై ఏళ్ల వయస్సు దాటిన ప్రతి ఒక్కరిలో గుండె పనితీరుకు సంబంధించిన ఆలోచన, ఆందోళన తప్పక ఉంటుంది. అందుకే 40 నుంచి 50 వరకు ఏటా ఒకసారి 50 దాటాక ఏడాదికి రెండుసార్లు లిపిడ్‌ ప్రొఫైల్‌ రక్తపరీక్ష చేయించుకొని వైద్యులు సలహా తీసుకుంటే మీ గుండె నిక్షేపంగా ఉంటుంది. పరీక్షల సంగతి పక్కన పెడితే, గుండె ఆరోగ్యానికి ఏ రకమైన ఆహారాలు, జీవన విధానం ఆచరించాలనేది పరిశీలించండి. ప్రతిరోజు కనీసం ఐదు రకాల పండ్లు, కూరగాయలు తినండి. డైనింగ్‌ టేబుల్‌పై ఉప్పు, కారం లేకుండా చూసుకోండి. తినే సమయంలో అదనంగా ఉప్పు వేసుకునే అలవాటు మానండి. ఈ సీజన్‌లో యాపిల్స్‌ పుష్కలంగా లభిస్తాయి. గుండె ఆరోగ్యానికి యాపిల్‌ చాలా మంచిది. యాపిల్‌ ముక్కల్లో 3.7 గ్రాముల ఫైబర్‌ ఉంటుంది. నారింజపండ్ల రసంలో బి9 విటమిన్‌ఉంటుంది. ఇది గుండె జబ్బులకు దారితీసే హూమోసిస్టైన్‌ను తగ్గిస్తుంది. పచ్చి బఠానీల్లో బి2, బి6 విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ విటమిన్లు రక్తనాళాలను పదిలంగా కాపాడుతాయి. రక్తనాళాలు దెబ్బతినడం వల్ల గుండె జబ్బులు వచ్చిపడతాయి. ద్రాక్షపండ్లు గుండె జబ్బులను దూరంగా ఉంచుతాయి. ద్రాక్ష వల్ల కొలెస్ట్రాల్‌ అదుపులో ఉంటుంది. ప్లావాన్స్‌, అంతోసైనిన్‌ వంటి ఎన్నో మంచి లక్షణాలు ద్రాక్షపండ్లలో ఉన్నాయి. ద్రాక్షను గోరువెచ్చని నీళ్లలో లేదా ఉప్పు నీటిలో కడిగి తీసుకోవడం వల్ల రసాయనాల ప్రభావం మనపై పడకుండా ఉంటుంది. వేరుశనగ పప్పులు గుండెకు ఎంతో మేలు చేస్తాయట. రోజూ కాసిని వేరుశనగ పప్పులు, బాదంపప్పు, వాల్‌నట్స్‌ తీసుకుంటే గుండె నిక్షేపంగా ఉంటుందంటున్నారు నిపుణులు.

No comments:

Post a Comment