Monday, October 8, 2012

కిడ్నీలో స్టోన్స్‌‌ని గుర్తించడం ఎలా?


తలనొప్పి, నడుము నొప్పిలాగే ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ సమస్య చాలా విపరీతంగా పెరిగిపోతోంది. ఈ కిడ్నీ స్టోన్స్ సమస్య ఎవరికైనా ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. అందుకు వైద్యులు చెప్పిన కొన్ని సలహాలను ఇక్కడ తెలియజేస్తున్నాం. ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి వంశపారంపర్యంగా రావచ్చు, మూత్ర నాళాలు బంధించబడితే ఏర్పడొచ్చు, పారా థైరాయిడ్ అనబడే గ్రంథి అధికంగా పనిచేయడం వల్ల ఏర్పడొచ్చు, అదేవిధంగా ఇన్ఫెక్షన్ కారణంగా కూడా ఏర్పడొచ్చు.

నడుము నొప్పిగా ప్రారంభమై, అది ముందు భాగంలోని పొట్ట దగ్గరికి వ్యాపించినా, పొత్తి కడుపులో నొప్పి కలిగినా, తొడలు అలాగే ఇతర అంతర్గత అంగాలకి వ్యాపించినా,జ్వరం, మూత్రంలో రక్తం పడడం మొదలైన లక్షణాలు కనిపించినా అది కిడ్నీ స్టోన్స్ ఏర్పడడం వల్ల కావచ్చు. నిర్లక్ష్యం చేస్తే ఆ రాయి కొద్దికొద్దిగా పెరిగి దుప్పి కొమ్ములాగా తయారవుతుంది.

5 మిల్లీమీటర్ల కన్నా చిన్న రాయి అయితే, మూత్రం ద్వారా బయటికి వచ్చేస్తుంది. 8 మిల్లీమీటర్లు ఉంటే 80 శాతం బయటికి వచ్చే అవకాశం ఉంది. 1 సెంటీమీటర్ ఉంటే చాలా శ్రమతో కూడుకున్న పని. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే మూత్రాశయం మూత్రాన్ని జారీ కానివ్వలేదు. పని చెయ్యదు కూడా.

రక్త పరీక్ష ద్వారా రాళ్ళు ఉన్నాయా? లేవా? అన్న విషయాన్ని ధృవపరచుకోవాలి. తర్వాత స్కానింగ్ ద్వారా ఆ రాళ్ళు ఉన్న ప్రదేశం, వాటి పరిమాణం తెలుసుకోవచ్చు. ఐవిపి ఎక్స్‌రే ద్వారా మూత్రాశయం ఎలా పనిచేస్తోందనే విషయం కూడా తెలుసుకోవచ్చు. మందుల వల్ల నయం కాని పక్షంలో ఎక్స్‌ట్రా కార్పోరియల్ షాక్‌వేవ్ లిథోట్రిప్సీ అనే విధానం ద్వారా రాళ్ళను ముక్కలు చేస్తారు. పెద్ద రాయి అయితే నడుము వెనుక భాగంలో రంధ్రం చేసి టెలిస్కోప్ ద్వారా చూస్తూ రాళ్ళను ముక్కలు చెయ్యొచ్చు. ఒకసారి తొలగించినా మళ్ళీ తయారయ్యే అవకాశం ఉంది. అందువల్ల రాళ్ళు తొలగించిన తర్వాత ఎక్కువగా మంచినీరు, బార్లీ, నిమ్మరసం తాగుతుండాలి. అదేవిధంగా, మటన్, బాదం, పిస్తా, చాక్లెట్‌లు మొదలైన వాటిని దూరంగా ఉంచడం శ్రేయస్కరం.
(పెరటి వైద్యం బ్లాగ్ నుండి సేకరణ )

No comments:

Post a Comment