Sunday, October 7, 2012


అద్బుతమైన సుగంధ ద్రవ్యాలు మన సొంతం  
(పెరటి వైద్యం బ్లాగ్ నుండి సేకరణ)

ఇప్పటివరకు ఏలకులు, దాల్చిని, లవంగాలు, జీలకర్ర అంటే ఇంట్లో ఉండే సుగంధద్రవ్యాలే అనుకుంటున్నారా? కాదు... మన దేశంలోని ఆహారపు అలవాట్లు అన్నీ ఆరోగ్యకరమైనవే. మన పోపులపెట్టెలోని వస్తువులు ఆరోగ్యం చేకూర్చడంలో తక్కువవేమీ కాదు. ఇప్పుడు ప్రపంచమంతా... ఆరోగ్యకరమైన మన సుగంధద్రవ్యాల వైపు పరిశీలనగా చూస్తోంది.
అందులోని మర్మాలను కనుక్కొని ప్రపంచానికి తెలియజెపుతోంది. మనకు తెలియకుండానే మనం వాడుతున్న కొన్ని సుగంధద్రవ్యాల గొప్పదనాన్ని మీరు తెలుసుకోండి. ఇకపై మీ సమస్యలకు అనుగుణంగా వాటి వాడకాన్ని మరి కాస్త పెంచి మరింత ఆరోగ్యాన్ని పొందండి.

అల్లం
ఇది మొక్క కాదు... వేరు. దీని రూటే వేరు. బాగా ప్రయాణం చేసి వచ్చాక కలిగే అలసట అల్లం వాసనతోనే తగ్గిపోతుంది. వాంతులయ్యే ఫీలింగ్ ఉన్నట్లుగా అనిపించే వికారం... అల్లం రసంతో మటుమాయమవుతుంది.

జీలకర్ర
దీన్ని అనాదిగా మనం వంటల్లో వాడుతున్నాం. రోమన్లు మిరియాలకు బదులుగా జీలకర్రను వాడేవారు. దీనిలో ఎన్నో ఔషధగుణాలున్నాయి. అన్నిటికంటే ప్రధానమైనది ఏమిటంటే... దీన్ని ఒకింత ఎక్కువగా వాడేవారిలో ఒత్తిడిని ఎదుర్కొనే శక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది.

పసుపు
వంటకాల్లోని దినుసుగా మాత్రమే కాకుండా... క్రిమిసంహారిణిగా పసుపుతో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాలు మనకు చాలా ఎక్కువే తెలుసు. దీనికి తోడుగా మరో ప్రయోజనం ఏమిటంటే... అజీర్ణాన్ని నయం చేయగల సామర్థ్యంతో పాటు క్యాన్సర్‌ను నిరోధించే శక్తి పసుపులో ఉంది.

ఏలకులు
ఏలకుల్లో తెలుపు, నలుపు, ఆకుపచ్చ వంటి మూడు రకాలు ఉంటాయి. అందులో ఆకుపచ్చవి అన్నిటికంటే శ్రేష్ఠం. నోటి దుర్గంధాన్ని పోగట్టడానికి మాత్రమే ఏలకులు పనికి వస్తాయన్న పరిమిత జ్ఞానాన్ని విస్తృతం చేసుకోవాలి. అవి స్థూలకాయాన్ని కూడా నివారిస్తాయి. పంటి సమస్యలు, చిగుళ్ల ఇన్ఫెక్షన్‌ను నిరోధిస్తాయి.

దాల్చిన చెక్క
దీని నుంచి సేకరించే నూనెలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నాయి. అందుకే వాటి నుంచి సోకే ఇన్ఫెక్షన్స్‌కు దాల్చిని మంచి ఔషధం. అంతేకాదు, కొంతమేరకు రక్తంలోని చక్కెరపాళ్లను నియంత్రించడానికి దోహదపడుతుంది. దాల్చినచెక్క నమలడం, దాని నుంచి వచ్చే వాసన పీల్చడం పురుషుల్లో సెక్స్ సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది.

లవంగం
పంటి నొప్పికి లవంగ నూనె రాయడం, దగ్గు వచ్చినప్పుడు లవంగ మొగ్గను బుగ్గన పెట్టుకోవడం తరతరాలుగా మనం అనుసరిస్తున్నదే. లవంగంలోని ‘యూజనాల్’ అనే లోకల్ అనస్థీషియా కలిగించే గుణం వల్ల ఈ నొప్పి నివారణ కలుగుతోందని పరిశోధన ఫలితాల వల్ల తెలుస్తోంది. పంటినొప్పినే కాదు... లవంగం నోటిలోని పుండ్లను కూడా సమర్థంగా తగ్గిస్తుంది.

కరివేపాకు
తాలింపుల్లో వాడే కరివేపాకు వల్లనే దక్షిణభారతదేశంలో క్యాన్సర్ల తాకిడి తక్కువట. దీంతో మరోరకం ప్రయోజనం ఉంది. కరివేప ఆకులను పాలతో కలిపి వేడి చేసి ఒంటిపై ర్యాష్ ఉన్నచోట పూస్తే వేంటనే తగ్గుతుంది. దురద, మంట నుంచి త్వరగా ఉపశమనం ఉంటుంది.

No comments:

Post a Comment